ప్రముఖ హేతువాది, సాహితీవేత్త, పరిశోధకులు డాక్టర్ మలయశ్రీ (86) మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు కలిగించిందని తెలంగాణ హేతువాద సంఘం బాధ్యులు కె. శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన మృతి సాహితీ లోకానికి, హేతువాద ఉద్యమాలకు తీవ్ర నష్టమని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లకు చెందిన మలయశ్రీ, లెక్చరర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, భౌతికవాది మాసపత్రిక వ్యవస్థాపకులు, ఎడిటర్‌గా సేవలందించారు. తెలుగు సాహిత్యానికి, హేతువాద ఉద్యమానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని శ్రీనివాసాచారి కొనియాడారు.
మలయశ్రీ 'వెయ్యేళ్ల కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర'పై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన 26 పుస్తకాలు రచించడంతో పాటు, ఎనిమిది కథా సంపుటాలు, ఇరవై ఆరు నవలలు, పదమూడు వ్యాస సంపుటాలు, పది కవితా సంపుటాలు, ఏడు నాటకాలు, ఐదు నృత్య నాటికలు, నాలుగు హాస్య గీతికలు, రెండు బుర్ర కథలు రచించారు.
వివిధ అంశాలపై వెయ్యికి పైగా వ్యాసాలను వివిధ పత్రికలకు రచించిన మలయశ్రీ, హేతువాద, మానవవాద సదస్సులలో ఉపన్యాసకుడిగా పాల్గొనేవారు. 'తొలి తెలుగు చక్రవర్తులు' పేరుతో కాకతీయ రాజులపై నాటకాలు రచించారు. ఆయన 'శాంతి పథం' పుస్తకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉండేది. మలయశ్రీ రెండుసార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. కొత్త రచయితలకు ప్రతి ఏటా 'మలయశ్రీ సాహిత్య అవార్డు'ను అందజేస్తున్నారు.
ప్రముఖ హేతువాద, మానవవాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రిపై మలయశ్రీకి అభిమానం ఉండేది. ఆయన 'హేతువాది' మాసపత్రికకు వ్యాసాలు రాశారు. తెలంగాణ రాష్ట్రంలో అరుదైన హేతువాదులలో మలయశ్రీ ఒకరని, వారి మరణం సాహితీ లోకానికి, హేతువాద ఉద్యమాలకు తీవ్ర లోటు అని శ్రీనివాసాచారి అభిప్రాయపడ్డారు.







