మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, దీనికోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మహత్మా జ్యోతిరావ్ పూలే 200వ జయంతి సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జాగృతి ఎంత నిబద్ధతతో పనిచేసిందో, బీసీ ఉపకోటా కోసం కూడా అంతే నిబద్ధతతో పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రావడంలో జాగృతి ఉద్యమం కీలక పాత్ర పోషించిందని, అదే స్ఫూర్తితో బీసీలకు ఉపకోటా వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి బీసీ కోటా కోసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతామని ఆమె పేర్కొన్నారు. అధికార బలం ఉందని బీసీ కోటా లేకుండా బిల్లు పాస్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాల్సిన పూలే విగ్రహం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా, ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, కానీ పూలే జయంతి నాటికి కూడా విగ్రహ ఏర్పాటు పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి నాటికి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పూలే ఆశయాల సాధన కోసం అహర్నిశలు పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని కవిత అన్నారు. సమాజంలో మార్పు తేవాలంటే ముందు మన నుంచే ఆ మార్పు మొదలవ్వాలని, పూలే అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయాలని, వారి డిమాండ్ల సాధన కోసం కొత్తగూడెంలో ధర్నా చేస్తున్న వారికి మద్దతుగా జాగృతి నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు.







