తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణకు సంబంధించి ఒక కీలకమైన బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026' పేరుతో ఈ బిల్లును సిద్ధం చేశారు. దీని ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించనున్నారు.
వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్న సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, వారి జీతంలో 15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. తల్లిదండ్రులను సంరక్షించని పక్షంలో, వారి నెలవారీ వేతనంలో 15 శాతం నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులు నియమితులవుతారు.
బిల్లు ప్రకారం, ఆధారం లేని తల్లిదండ్రులు జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పరిశీలించిన తర్వాత, 60 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తారు. ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని (15 శాతం లేదా రూ.10 వేలు, ఏది తక్కువైతే అది) తల్లిదండ్రులకు భృతిగా మంజూరు చేస్తారు. ఒకవేళ జిల్లా అధికారి స్పందించకపోతే, రాష్ట్ర స్థాయి కమిషనర్గా వ్యవహరించే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తికి అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.











