తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహించతలపెట్టిన క్రీడా పోటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పెండింగ్లో ఉండగా, క్రీడా పోటీల పేరుతో సమయం వృథా చేయడం సరికాదని ఆయన విమర్శించారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శని, ఆదివారాల్లో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించనున్నారు. అయితే, ఈ పోటీల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనబోరని కేటీఆర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమస్యలు, సంక్షోభాలు నెలకొన్నాయని, ఈ తరుణంలో క్రీడల్లో పాల్గొని సమయం వృథా చేయడం తగదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. శాసనసభను కనీసం మరో 10 రోజులు కొనసాగించి, ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడాన్ని ప్రజలు సమర్థించబోరని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని కేటీఆర్ కోరారు. ఎమ్మెల్యేలు క్రీడలు ఆడి ఒలింపిక్స్కి వెళ్లేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. క్రీడలను ప్రోత్సహించాలంటే పిల్లలకు అవకాశాలు కల్పించి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆటలు ఆడించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత రెండ్రోజులపాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.











