తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 30 మంది దివ్యాంగులకు స్కూటీలు, 15 మందికి బ్యాటరీ వీల్ చైర్లు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం ఆధారిత జీవనానికి అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెస్తున్నామని ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు.
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, పట్టుదల, మనోధైర్యంతో దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. సవ్యాంగులకు దీటుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారని, లక్ష్య సాధనకు కృషి, ఆత్మ విశ్వాసం ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జిల్లా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం జిల్లా సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందని, వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.












