దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీల్లో తెలంగాణ ఉద్యోగ కళాకారులు విశేష ప్రతిభ కనబరిచి, పలు పతకాలు సాధించారు. వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.
కేంద్ర సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక బోర్డు (CCSCSB) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలైన ఉద్యోగుల బృందం, శుక్రవారం రవీంద్రభారతిలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూనే, కళల పట్ల మక్కువతో జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
భవిష్యత్తులోనూ ఉద్యోగ కళాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 47 మంది ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ఈ ఉద్యోగులు 16 రకాల కళారూపాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి దేశవ్యాప్త ప్రశంసలు అందుకున్నారు. వెస్ట్రన్ డ్యాన్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన గంధం సంతోష్‌ను, వీణ వాయిద్యంలో తృతీయ బహుమతి గెలుచుకున్న డాక్టర్ కె. పృథును, నాటిక విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైన ఇంద్రను మంత్రి సత్కరించారు.
తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి యామిని కనకతార నేతృత్వం వహించగా, బృందం మేనేజర్ శ్రీశైలం సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగ ప్రతినిధులు, విజేతలు పాల్గొన్నారు.











