ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు, సరళ జీవనం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణాత్మకంగా స్పందిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో సాదాసీదా పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు తగ్గించాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పరిమిత వాహనాలతోనే కాన్వాయ్ ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సాధారణ ట్రాఫిక్ మధ్యలోనే ప్రయాణించాలని సీఎం సూచించినట్లు సమాచారం.
ఇంధన పొదుపు చర్యలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ మొబిలిటీ, ఇంధన వినియోగ నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రభుత్వ పనితీరులో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు ఇంధన వృధాను అరికట్టడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగంలో సాదాసీదా పాలనకు ప్రాధాన్యతను సూచిస్తుంది.











