రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2లోపు ఆరోగ్య కార్డులు అందించాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కోరింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, 2వ పీఆర్సీని అమలు చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పలు సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా నగదు రహిత వైద్యం వెంటనే అందించాలని, రెవెన్యూ శాఖలో వీఆర్ఏల వారసుల నియామకం, తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రతినిధులు సూచించారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, రెవెన్యూ శాఖలో ధరణి ఆపరేటర్ల సేవలను కొనసాగించాలని వినతి చేశారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహశీల్దార్స్ అసోసియేషన్, టీపీయూఎస్, టీజీఆర్ఎస్ఏ, జీపీఓ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.











