బహుజన ధీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అంతాయపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.ఎస్. చంద్రావతి, జిల్లా బి.సి. అభివృద్ధి అధికారి టి. ఝాన్సీ రాణి మాట్లాడుతూ అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
పాపన్న గౌడ్ జీవితం, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని అధికారులు అభివర్ణించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.
రేపు (ఏప్రిల్ 03, శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, బి.సి. సంఘాల నాయకులు, కురుమ కుల సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని జిల్లా యంత్రాంగం కోరింది.







