సంగారెడ్డి జిల్లాలో ఎల్పీజీ వంట గ్యాస్ కొరత లేదని, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎల్పీజీ సరఫరా మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాలో కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించే చర్యలను సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన వంట గ్యాస్‌ను ఇంటి వద్దకే సమయానికి అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు గ్యాస్ సరఫరాలో కొరత లేకుండా చూడాలని, అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డిమాండ్‌కు అనుగుణంగా స్టాక్ నిర్వహణతో పాటు అదనంగా 15శాతం నిల్వలను ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్యాస్ ఏజెన్సీలు అవసరమైన స్టాక్‌ను ముందుగానే సమకూర్చుకోవాలని, వినియోగదారుల బుకింగ్‌లను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుని ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.












