సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీష్, జనరల్ సెక్రటరీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి ఉమా దేవిలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరు రవిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. పీఆర్సీ, సీపీఎస్, డీఏ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ మాట్లాడుతూ, ఉద్యోగులు సహనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన టీజీఈ జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
జనరల్ సెక్రటరీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్, కోశాధికారి ఉమాదేవి కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జావిద్ అలీ, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు నిర్మల రాజకుమారిలకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.












