భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంగారెడ్డి జిల్లాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, శాసన సభ్యుడు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని, ఉన్నత ఆలోచనలు, కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, యువత ఆయన ఆశయాలను అనుసరించి సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో యువత సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆయన సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేశారని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అర్హులకు అవగాహన కల్పించాలని కుల సంఘాల ప్రతినిధులకు సూచించారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధకుడని తెలిపారు. దళితుల హక్కుల కోసం పోరాడి, దేశ అభివృద్ధికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ పనిచేస్తున్నాయని, సమానత్వ సమాజ నిర్మాణానికి ఆయన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి.












