జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సంగారెడ్డిలోని శిశు గృహ, జువైనల్ జస్టిస్ బోర్డు మరియు సఖి కేంద్రాలను తనిఖీ చేశారు. పిల్లల సంరక్షణ, బాలల హక్కులు, బాధితుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఆమె అధికారులకు సూచనలు అందించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవానిచంద్ర ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. పిల్లల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణతో పాటు పరిశుభ్రత పాటించాలని బి. సౌజన్య సూచించారు. విద్యార్థుల పట్ల అదనపు శ్రద్ధ చూపాలని ఆమె కోరారు.
సఖి కేంద్రంలో బాధితుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, జువైనల్ జస్టిస్ బోర్డులో బాలల హక్కుల రక్షణ చట్టంపై అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.
న్యాయపరమైన సహాయం అవసరమైన వారికి ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని, దీనికోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని బి. సౌజన్య తెలిపారు.












