ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో 75 రోజులు పూర్తయ్యాయని, కార్యక్రమం సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతం, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం "జయ జయ హే తెలంగాణ" గీతంతో కొనసాగింది.
ఈ సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని వేగంగా పరిష్కరించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే జూన్ 2న ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగుతాయని, ఆయిల్ ఫామ్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యారంగంలో విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, వ్యవసాయంలో పంట మార్పిడి, వాణిజ్య పంటలు, కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, మెరుగైన వైద్య సేవలకు బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. అంతకు ముందు జిల్లా అధికారులు ఆయా శాఖల అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.












