తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాబోయే 99 రోజుల కార్యాచరణపై నిజామాబాద్ పోలీస్ శాఖ సన్నద్ధమైంది. ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు అమలు చేయనున్న ఈ ప్రణాళిక లక్ష్యాలను అధికారులకు వివరించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్, మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
జిల్లాలో పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు కీలకమని, వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానం, రికార్డుల అనుసంధానం, వాహనాల పార్కింగ్ వ్యవస్థ, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు వంటి చర్యలను అమలు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం.
నేర నియంత్రణలో భాగంగా సీసీటీవీ నిఘాను పెంపుతో పాటు గ్రౌండ్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని చెప్పారు. రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని వేగవంతం చేసి, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్-సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి సారించారు.
అలాగే, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుర్వినియోగం, భరోసా కేంద్రం, సఖి సెంటర్, షీ టీమ్స్ సేవలు, మహిళల హక్కులపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఐటీ సెల్ మరియు కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


