బాల్య వివాహాలు, బాలలపై వేధింపుల నివారణ లక్ష్యంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 'బాలల చట్టాల ప్రచార రథాన్ని' జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రారంభించారు. ఈ రథం ద్వారా బాలల హక్కులు, రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ ప్రచార రథాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఈ రథాన్ని ప్రారంభించారు.
ఈ ప్రచార రథం జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వాడలో పర్యటిస్తూ బాల్య వివాహాలు, అక్రమ దత్తతలు, బాలలపై లైంగిక వేధింపుల వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. పిల్లలపై ఏదైనా అఘాయిత్యాలు, వేధింపులు జరిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
పిల్లలను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లాలో 67 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లలో సుమారు 1800 మంది పిల్లలకు ప్రభుత్వం అవసరమైన సేవలు అందిస్తున్నట్లు, అనాధ పిల్లలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ తిరుమల దేవి, సిడబ్ల్యూసీ సభ్యుడు రామ్మోహన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ రహీం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











