జిల్లాలో ఇసుక సరఫరాలో పారదర్శకతను, సమయపాలనను పెంచే లక్ష్యంతో “మన ఇసుక – మన వాహనం” ఆన్లైన్ పోర్టల్ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా యంత్రాంగం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో నిర్వహించిన ఈ శిక్షణలో తహసీల్దార్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM-G), వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఏప్రిల్ 1, 2026 నుంచి ఇసుక అవసరమున్న వినియోగదారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, అనుమతులు పొందిన వారికి మాత్రమే ఇసుక సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నూతన విధానం ఇసుక పంపిణీలో అవకతవకలను అరికట్టి, పారదర్శకతను పెంచుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ముఖ్యంగా “ఇందిరమ్మ ఇల్లు” నిర్మాణాలకు ఇసుక సరఫరా సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
మైన్స్ శాఖ అధికారులు ఆన్లైన్ దరఖాస్తు, అనుమతుల ప్రక్రియపై శిక్షణలో సమగ్ర అవగాహన కల్పించారు. సాంకేతికత ఆధారిత ఈ వ్యవస్థ ఇసుక సరఫరా నిర్వహణను మెరుగుపరుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.








