కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ చర్ల మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ సత్యనారాయణపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియ పురోగతిని, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం, సత్యనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పునాది నుంచి స్లాబ్ వరకు ప్రతి దశలో ఇంజనీరింగ్ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిమెంట్, ఇసుక, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి నాణ్యంగా ఉండేలా చూడాలని, పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన గృహ వసతి కల్పించడమే లక్ష్యమని, పనులు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించారు. మేటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, వంటగది, అవుట్ పేషెంట్ విభాగం తదితర విభాగాలను సందర్శించి సేవల నాణ్యతను తనిఖీ చేశారు. ఓపీ విభాగంలో చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల నిల్వలను పరిశీలించి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా స్టాక్ నిర్వహణను క్రమబద్ధీకరించాలని సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతపై దృష్టి సారిస్తూ శుభ్రతతో కూడిన పోషకాహారం అందించాలన్నారు.
ఆసుపత్రిలో త్రాగునీటి కొరత ఉన్నట్లు గుర్తించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిరంతర నీటి సరఫరా కల్పించాలని ఆదేశించారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు, శుభ్రత, మౌలిక సదుపాయాలు అందేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ ముకేశ్, ఏఓ లావణ్య, మిషన్ భగీరథ ఏఈలు అరుణ్, రాము, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్డెంట్ డాక్టర్ సాయి వర్ధన్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










