పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు వంట సామాగ్రిని అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తోందని, ప్రజాపాలన ద్వారా వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు శ్రీరామ్, సుభాష్, సుజాతల నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఆయన, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సంత స్థలం లేనివారికి కూడా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు తాటి లావణ్య ప్రసాద్, గడ్డమీది మహేష్, ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, మాజీ కౌన్సిలర్లు చాట్ల వంశీ, సలీం, జమీల్, రంగ రమేష్, గంగుల్ రెడ్డి, రాజశేఖర్, నిరంజన్, కోటి, శశి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.












