హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ ల సంఖ్యను పెంచడంతో పాటు, సమయపాలనతో సేవలను నడపాలని సూచించారు.
శానసమండలి హాల్ లో ఎంఎంటీఎస్ సేవలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో, ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై ఆయన ఆరా తీశారు. దీనికి కారణాలను అన్వేషించి, పరిష్కార మార్గాలను సూచించాలని అధికారులను కోరారు.
స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, లోపలికి స్టేషన్లు ఉండటం వంటి సమస్యలను అధిగమించడానికి మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే, ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మెరుగైన వసతులు కల్పించడం ద్వారా ప్రయాణికులను ఆకర్షించవచ్చని, స్వీయ ఆదాయ వనరులను పెంచుకోవాలని అధికారులకు సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతుల మెరుగుదల అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు.











