కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ, అంగన్వాడి కేంద్రం తనిఖీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. గృహప్రవేశానికి సిద్ధమైన ఇళ్లను వచ్చే నెల 6వ తేదీ నాటికి ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మించుకుంటున్న ఇళ్ల పనులను పరిశీలించి, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన కలెక్టర్, గ్రామాభివృద్ధిలో భాగంగా సామూహిక వసతుల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని, ప్రతి పథకం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేయాలని తెలిపారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, చిన్నారులతో ముచ్చటిస్తూ వారి ఆరోగ్యం, సంక్షేమంపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్రంలోని ఆహార మెనూను, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. పిల్లలకు పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, ఏడీఎల్ డీఆర్డీఓ విజయలక్ష్మి, సంబంధిత మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












