కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి పౌరుడు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి టీ నాగరాణి పిలుపునిచ్చారు. అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
సాధన స్వచ్ఛంద సంస్థ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్’ ఆధ్వర్యంలో, లైన్ డిపార్ట్మెంట్ల సహకారంతో నిర్వహిస్తున్న బాల్య వివాహ విముక్తి ప్రచార రథయాత్రలో భాగంగా మంగళవారం పాల్వంచ మండలం మంతన్ దేవునిపల్లి, వేల్పుగొండ, బాడీ పార్దిపేట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి టీ నాగరాణి మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కి చెప్పారు.
సమాజంలో ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వాటిని నిర్మూలించడానికి అందరి సమిష్టి కృషి అవసరమని నాగరాణి తెలిపారు. తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు సాధన స్వచ్ఛంద సంస్థ చేపట్టిన ఈ ప్రచార యాత్రను ఆమె ప్రశంసించారు. ఈ రథయాత్ర పాల్వంచ, మాచారెడ్డి, భిక్నూర్, సదాశివనగర్ మండలాలలోని వివిధ గ్రామాలలో కొనసాగనుంది.
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, సాధన సభ్యులు గిరిజ, మమత, సంధ్యారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


