భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట ఇటీవల లొంగిపోయిన 27 మంది మావోయిస్టు సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రివార్డు నగదును చెక్కుల రూపంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. మొత్తం 62,50,000/- రూపాయలను వారికి పంపిణీ చేశారు.
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన ఇద్దరు DVCMలు, 11 మంది ACMలు, 14 మంది ప్లటూన్ సభ్యులకు ఈ నగదును అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదులను వారి పునరావాసం కోసం అందిస్తున్నామని తెలిపారు. మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకులను బలవంతంగా చేర్చుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.
లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

