సిద్దిపేట జిల్లా, గజ్వేల్ సమీపంలోని కొండ పోచమ్మ అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలు బలంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కప్పర ప్రసాద్ రావు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, అర్చకుల ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పల్లెటూర్లలో రాజకీయ విభేదాలున్నా, మానవ సంబంధాలు మాత్రం చెక్కుచెదరవని అన్నారు. తన నియామకం సందర్భంగా వివిధ పార్టీల మిత్రులు కూడా అభినందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, జర్నలిస్టులతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. తనకు ఈ గౌరవాన్ని కల్పించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మేడ్చల్–మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

