గంభీరావుపేట మండల కేంద్రంలో బాల్య వివాహాల వల్ల కలిగే శారీరక, సామాజిక, ఆర్థిక, మానసిక సమస్యలపై జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
చిన్న వయసులో వివాహాలు బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో పాటు బలహీనమైన పిల్లలు జన్మించే అవకాశం ఉందని వివరించారు. భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు.
సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా పడుతుందని హెచ్చరించారు. పుట్టిన తేదీకి ఆధార్ కార్డు కాకుండా జనన ధృవీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పిల్లలు తమ కెరీర్‌పై దృష్టి సారించాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు 18 ఏళ్లు నిండిన వారికే వర్తిస్తాయని గుర్తు చేశారు.
ఏవైనా ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నంబర్లు 1098, 181, 100 లకు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.











