మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, పార్టీలోని ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, అందరికీ తగిన రీతిలో పదవులు ఇవ్వడం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కమలాక్షి రాజన్ పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం కూకట్పల్లి ఎన్ కే ఎన్ ఆర్ గార్డెన్స్‌లో జిల్లా మహిళా నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కమలాక్షి రాజన్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు.
33% మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని బండి రమేష్ తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై కేసు నమోదు అయినందున, నైతికంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణలత, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ పుష్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.











