ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం తీవ్రంగా విమర్శించారు.
గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్పోరేట్ శక్తులకు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు.
యూపీఏ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలపై భారాలు వేయలేదని, కానీ ప్రస్తుతం ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్రం ఎక్సైజ్, సుంకాలు, సెస్సుల పేరుతో ప్రజలను దోచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలను, మీడియా కల్పించిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, అయితే ఎన్నికలు ముగిసిన వారం తిరగకముందే దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదని, ప్రజలు దేశభక్తితో పొదుపు చేసుకోవాలని సూత్రాలు వల్లెవేయడం, దుబారా ఖర్చు తగ్గించుకోవాలని కర్తవ్య బోధన చేయడం మోడీ అసమర్థతను తెలియజేస్తోందని సత్యం శ్రీరంగం అభిప్రాయపడ్డారు.
దేశ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే తన కర్తవ్యాన్ని, తన దుబారా ఖర్చులను తగ్గించుకోవడం మర్చిపోయి, ఈ ఆర్థిక సంక్షోభ భారాన్ని దేశభక్తితో సామాన్య ప్రజలు భరించాలని చేతులు దులుపుకోవడం తన పన్నెండేళ్ల పాలన పతనావస్థకు చేరిందని చెప్పడమేనని ఆయన అన్నారు. ఇప్పటికే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందని, డాలర్‌తో పోటీపడి ప్రపంచ ఆర్థిక రంగంలో అగ్రగామి దేశంగా ఎలా నిలుస్తుందని, 500 ట్రిలియన్ డాలర్లకు ఎప్పుడు చేరుతుందని ఆయన ప్రశ్నించారు.











