తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణ దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మంగళవారం నీలగిరి జిల్లా ఊటీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఊటీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి బి.రామచంద్రన్ ను గెలిపిస్తే, ఊటీ ప్రాశస్త్యాన్ని కాపాడడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా, తేయాకు తోటలపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమిళనాడులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని, తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటీ చేస్తున్న 28 స్థానాల్లో విజయం సునాయాసమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీ గణనీయంగా పెరుగుతుందని, ఊటీ వంటి నియోజకవర్గంలో ఊహించని మెజారిటీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే-కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చాక ఊటీలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.











