సంగారెడ్డి, జూలై 15
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)ను విజయవంతంగా నిర్వహించి, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్)ను విజయవంతంగా నిర్వహించి, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని వివరించి, రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.
సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన ఏర్పడిందని, అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వంద శాతం పూర్తయ్యిందన్నారు. ఇప్పటివరకు సగటున 55 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తైందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్‌లో 73 శాతం, ఆందోల్‌లో 65 శాతం, జహీరాబాద్‌లో 61 శాతం, సంగారెడ్డిలో 54 శాతం, పటాన్చెరులో 35 శాతం డిజిటైజేషన్ పూర్తయిందన్నారు.
నిర్ణీత సమయంలోగా జిల్లాలో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని, ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడంతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఆర్డీఓ రాజేందర్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.











