ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని తన నివాసంలో మంగళవారం BLAలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.
ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ్, ఆందోల్, పుల్కల్, చౌటకూర్, రేగోడ్, వట్పల్లి, అల్లదుర్గ్ మండలాల BLAలు, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన ఈ సమావేశంలో SIR కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయరాదని BLAలకు స్పష్టం చేశారు.
ఓటర్లతో సమన్వయం చేసుకుంటూ గడువులోగా SIR ప్రక్రియను పూర్తి చేసి, ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ కోసం బూత్ లెవెల్ అధికారుల (BLO)లకు అందించాలని మంత్రి సూచించారు. BLAలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో PCC డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడి సతీష్, బాలాజీ నరసింహులు, దుర్గారెడ్డి, దశరథ్, రమేష్ జోషి, శివరాజ్, శేషారెడ్డి, దిగంబర్ రావు, రమేష్, మాజీ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.











