వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించి, వినతిపత్రం సమర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల పట్ల కర్కోటకంగా వ్యవహరిస్తున్నారని, వంద రూపాయల చీర ఇచ్చి కోటీశ్వరులను చేస్తున్నామని అబద్దాలు చెబుతున్నారని కవిత ఆరోపించారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేయడం వల్ల మహిళలు మనశ్శాంతి కోల్పోయారని, ఒక మహిళ గర్భస్రావానికి గురైందని, వారి భర్తల రోదనలు వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడని, ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గవర్నర్ కు వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆలైన్మెంట్ మార్పులు, రాయగిరిలో ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ, పరిగి మండలం కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించినట్లు కవిత తెలిపారు. తమ విన్నపాన్ని గవర్నర్ ఓపికగా ఆలకించారని, నివేదిక తెప్పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లక్ష ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు పథకం పన్నారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆరోపించారు. ఫోర్త్ సిటీ, ట్రిపుల్ ఆర్, పరిగి ఇండస్ట్రీయల్ కారిడర్, వెలుగుమట్ల లో భూ దోపిడీకి ప్లాన్ వేశారని, దీనిపై ఎవరికి చెప్పినా ఫలితం లేకపోవడంతోనే గవర్నర్ ను ఆశ్రయించామని తెలిపారు. కచ్చితంగా గవర్నర్ న్యాయం చేస్తారని నమ్మకం ఉందని, లేదంటే త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
వెలుగుమట్ల లో భూ బాధితులకు అక్కడే ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు, పరిగి, ట్రిపుల్ ఆర్ సేకరణను తాత్కాలికంగా ఆపినట్లు కవిత గుర్తు చేశారు. అయితే, పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి, సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ పోరాట బాట పడతామని కవిత తేల్చి చెప్పారు.











