రైతులు పండించిన వడ్ల కొనుగోలుపై ప్రభుత్వానికి సూచనలు చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుంచి తొలగించడంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
జగిత్యాల డిపో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని మంత్రికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించినందుకు డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి పెద్దపెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కవిత ఆరోపించారు. ఎన్నికల సమయంలో 'ప్రజాస్వామ్య పునరుద్ధరణ' పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
నేడు ప్రజా సమస్యలపై ప్రశ్నించే సామాన్యుల పొట్ట కొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత ధ్వజమెత్తారు. ఒక సామాన్య డ్రైవర్‌పై ఇంతటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం చూస్తుంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదని, కర్కోటక ప్రభుత్వం అని స్పష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు.
విధుల నుంచి అన్యాయంగా తప్పించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.











