తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాన్ని అవమానించేలా ఉన్నాయని కవిత విమర్శించారు. ఆరు దశాబ్దాల పాటు జరిగిన పోరాటాన్ని, వివక్షకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం తగదని ఆమె అన్నారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను కూడా అవమానించేలా ఉన్నాయని కవిత పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆమె హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా అని వారిని ప్రశ్నించారు.
వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తేజస్వీ సూర్యతో క్షమాపణలు చెప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే సత్తా లేకపోతే, ఆ ప్రాంత ఎంపీలుగా కొనసాగే అర్హత మీకు లేదని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.







