పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు నియోజకవర్గాల పెంపుపై చర్చ జరగనున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర అని ఆమె ఆరోపించారు.
తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ, "మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ అనేవి రెండు వేర్వేరు అంశాలు. వీటిని లింక్ చేయడం ద్వారా కేంద్రం కుట్ర చేస్తోంది" అని అన్నారు. నియోజకవర్గాలను 50 శాతం పెంచుతామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాలను పెంచడం వల్ల తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. "చూడటానికి ఇది కరెక్టే అనిపించినా, తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. బీహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ సీట్లు ఉంటాయి. దీనివల్ల తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది" అని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని, డీలిమిటేషన్ తర్వాత కూడా ఈ వాటా తగ్గకూడదని కవిత స్పష్టం చేశారు. "తగ్గితే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు, ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వడం లేదు. రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గితే మరింత నష్టపోతాం" అని ఆమె అన్నారు.
మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. "మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ను లింక్ చేయటం కాదు. మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా" అని ఆమె అన్నారు.











