కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో బాధితురాలి గోప్యతను కాపాడాలన్న తమ పార్టీ అధినేత కవితపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి ఘాటుగా స్పందించారు. ఫామ్ హౌస్ నుంచి వచ్చే స్క్రిప్టులు చదువుతూ జబర్దస్త్ స్కిట్లు చేయడం మానేసి, ముందు నిందితుడిని పట్టుకోవాలని వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీరును తీవ్రంగా ఖండించారు. బాధితురాలికి న్యాయం చేయాలన్న ఆకాంక్ష బీఆర్ఎస్ లో ఏమాత్రం కనిపించడం లేదని, బాధితురాలిని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. నిజంగా బాధితురాలికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ల ఇళ్ల ముందు ధర్నా చేయాలని సూచించారు.
చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ, కవిత గారు ఒక అమ్మలాగా బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమె గోప్యతను కాపాడాలని ఆలోచించారని, నిందితుడు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బాధితురాలిని బజారుకీడ్చవద్దని కవిత గారు మంచి సూచన చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు, బండి సంజయ్ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు.
మరోవైపు, టీఆర్ఎస్ నాయకురాలు సూరారపు కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ దగ్గర ఉండే ఒక వ్యక్తి ఓ మహిళా జర్నలిస్ట్ మరణానికి కారణమైతే, ఆ వ్యక్తిపై పోక్సో కేసు కూడా నమోదు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పోక్సో కేసు నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, దీనిపై బీఆర్ఎస్ ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని ఆమె నిలదీశారు. మహిళా జర్నలిస్ట్ చనిపోయినా బీఆర్ఎస్ కు చెందిన ఆ టీవీ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని, ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు వాడుకోమని, ప్రజా సమస్యలపై కొట్లాడుతామని వారు స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫామ్ హౌస్ నుంచి వచ్చే స్క్రిప్టులు చదువుతూ రోజుకో జబర్దస్త్ స్కిట్ చేయడం మానుకోవాలని సూచించారు. కేసులో పురోగతి సాధించాలంటే ముందు నిందితుడిని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు.







