దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై మరో భారం పడిందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం నిత్యావసరాల ధరలు, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రజలపై మరింత భారంగా మారిందని గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశంలో మాత్రం పెట్రోల్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని మహేశ్ గౌడ్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని, చివరికి సామాన్యుడు తీవ్రంగా నష్టపోతాడని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలకే పరిమితమైందని గౌడ్ విమర్శించారు. ప్రజా సంక్షేమం కంటే పన్నుల వసూళ్లపైనే మోదీ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన ఆరోపించారు.
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.












