విశాఖపట్నంలో ఒక ప్రముఖ గాయకుడి బంధువుపై పెళ్లి పేరుతో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే, నిందితుడు రాహుల్, బాధితురాలి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి, వాటిని బహిర్గతం చేస్తానని బెదిరించి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తెలిపారు.
ప్రముఖ గాయకుడి బంధువు కావడంతో, నిందితుడి బెదిరింపులకు భయపడిన బాధితురాలు, చివరికి విశాఖ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో మరో ఆరోపణ ఏమిటంటే, నిందితుడు రాహుల్, బాధితురాలు గర్భవతి అయిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడితో దిగిన ఫోటోలను చూపించి, చంపేస్తామని బెదిరించినట్లు కూడా బాధితురాలు ఆరోపించారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయని సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.











