సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ సేవా పథకం (NSS) మరియు మేరా యువ భారత్, సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం జరిగింది. దేశాభివృద్ధిలో యువత పాత్ర, సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో, ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా “భారత ప్రజాస్వామ్యంపై ఎమర్జెన్సీ ప్రభావం” అనే అంశంపై యువత తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, మానవ హక్కుల ప్రాముఖ్యతను విద్యార్థులు వివరించారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తొలిసారిగా నిర్వహించడం విశేషం.
జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల యువతలో 400 మందికి పైగా నమోదు చేసుకోగా, అందులోంచి ఎంపికైన 62 మంది పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అఖిలేష్ రెడ్డి, లా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీలత, యువజన అధికారి శశాంక్, కళాశాల ప్రొఫెసర్ పి. సుజాత ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించారు.


