తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమర్పించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ నివేదికపై తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టిపిటిఎఫ్) జిల్లా అధ్యక్షులు చింతల లింగం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నివేదికలోని కొన్ని ప్రతిపాదనలు విద్యావ్యవస్థకు హానికరం అని ఆయన విమర్శించారు.
టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ, ఆకునూరి మురళి నివేదికలో కొన్ని సానుకూల అంశాలున్నప్పటికీ, స్థూలంగా విద్యావ్యవస్థను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని ఆయన సూచించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో కొత్త పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుత పాఠశాలల పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తుందని, ఉపాధ్యాయుల నియామకంపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేసే సిఫార్సులు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తాయని లింగం ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని హేతుబద్ధీకరించాలనే ప్రతిపాదన హాస్యాస్పదమని, వేతనాల నిర్ణయం శాస్త్రీయ పద్ధతిలో జరగాలని తెలిపారు. ఉపాధ్యాయులు ఇప్పటికే నాలుగు పీఆర్సీలలో నష్టపోయారని, వారి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
ఉపాధ్యాయుల పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, కొందరు ప్రమోషన్లు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారని లింగం తెలిపారు. సర్వీస్ రూల్స్ పరిష్కారం కాకపోవడం, పర్యవేక్షక పోస్టులన్నీ ఇన్చార్జిలమయం కావడం వల్ల పదోన్నతులు పొందలేని పరిస్థితి నెలకొందని, ఈ విషయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా సిఫార్సులు చేయడం ఆకునూరి మురళి సంకుచిత స్వభావానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని టిపిటిఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ భావిస్తున్నట్లు చింతల లింగం తెలిపారు. ఈ నివేదికపై మరిన్ని చర్చలు, విశ్లేషణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

