కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి, వాసవి మాత చిత్రపటానికి పూలమాల అలంకరించి ఉత్సవాలను ప్రారంభించారు.
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవాల్లో వైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంస్కృతులను గౌరవిస్తుందని, అలాంటి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం ద్వారా ప్రజలందరూ భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. వాసవి మాత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైశ్య సంఘం ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు జిల్లా యంత్రాంగం తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరినీ ఆయన అభినందించారు. వాసవి మాత ఆశయాలను స్మరించుకుంటూ, ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు తెలిపారు.












