హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ప్రజలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హోలీ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇది ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జీవితాలు ఆనందంతో, ఐక్యతతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
అనంతరం నగరంలోని 34వ డివిజన్ కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులను 'నిజమైన సేవాధారుల'ని కొనియాడుతూ, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.
పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, పండుగలు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బంధాలను బలపరుస్తాయని అన్నారు. సమాజ అభివృద్ధికి ప్రతి వర్గం సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

