జిల్లాలో అనధికారికంగా నడుస్తున్న స్కిన్, హెయిర్ మరియు డెర్మాటాలజీ క్లినిక్‌లపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. కేపీహెచ్‌బీ పరిధిలో నాలుగు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు.
జిల్లా వైద్యాధికారి డా. ఉమా గౌరి ఆదేశాల మేరకు బుధవారం కేపీహెచ్‌బీ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి చట్టబద్ధ రిజిస్ట్రేషన్లు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు క్లినిక్‌లను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన క్లినిక్‌లలో వావ్ మెన్ స్కిన్ & కాస్మెటిక్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్, హెచ్‌సి హెయిర్ క్రియేషన్స్, డెర్మో 360 కాస్మెటాలజీ, అమిస్టా కాస్మెటాలజీ ఉన్నాయి.
తనిఖీల సందర్భంగా ఈ క్లినిక్‌లు “క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం” మరియు “అలోపతి చట్టం–2010” ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, అర్హత కలిగిన వైద్యులు లేకుండానే ప్రజలకు చికిత్సలు అందిస్తూ, ప్యాకేజీల పేరుతో ముందుగానే భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా. ఉమా గౌరి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే క్లినిక్‌లపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. కేవలం రిజిస్ట్రేషన్ ఉండటం సరిపోదని, ప్రతి చికిత్సను అర్హత కలిగిన నిపుణులే నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు.
ఈ తనిఖీల్లో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, డాక్టర్ పవన్, డిప్యూటీ డెమో వసంత తదితరులు పాల్గొన్నారు. అనధికార క్లినిక్‌లపై ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హత కలిగిన వైద్యుల వద్దనే చికిత్సలు తీసుకోవాలని సూచించారు.







