జిల్లాలో సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల లోపాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ‘బాల భరోసా’ కార్యక్రమం ద్వారా చిన్నారులలో నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు, శారీరక ఎదుగుదల లోపాలు, మానసిక వికాసంలో ఆలస్యం వంటి అంశాలను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలలో నమోదైన సుమారు 60,000 మంది చిన్నారుల ఆరోగ్య వివరాలను న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం ద్వారా సేకరించి, వారిలో ఏవైనా లోపాలుంటే గుర్తించే ప్రక్రియ జరుగుతోందని జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత వివరించారు. గుర్తించిన పిల్లలకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
ప్రతి చిన్నారి శారీరక, మానసిక స్థితిని నిశితంగా పరిశీలించి, అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ఆశయమని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడి టీచర్లు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, అక్కడి సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘బేటీ బచావో’ కార్యక్రమంలో భాగంగా ‘బేటీ జన్మోత్సవ్’ నిర్వహించి, నెలలోపు జన్మించిన ఆడపిల్లలకు కిట్లను అందజేశారు.







