బక్రీద్ పండుగను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
నగరంలో పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్ స్వయంగా ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, వాణిజ్య కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో పర్యటించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు.
విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని, రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచనలు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.
ప్రజలు శాంతియుత వాతావరణంలో, సోదరభావంతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నగర ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ ఫుట్ పెట్రోలింగ్ చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్, సుభాష్ నగర్, గాంధీ చౌక్, బోధన్ బస్టాండ్, ఖిల్లా రోడ్, పెద్దబజార్ వంటి పలు కీలక ప్రాంతాల్లో జరిగింది.











