రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఇబ్బందులు ఉన్నాయని, ఈ విషయం పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలుసని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కొంచెం ఓపిక పట్టాలని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ దోపిడీ, దౌర్జన్యం చేశామని అంగీకరించారని విమర్శించిన టీపీసీసీ చీఫ్, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చని, దానిని స్వాగతిస్తామని, అయితే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు.
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, సింగరేణిలో విద్యుత్ కొనుగోళ్లలో బీఆర్ఎస్ అవినీతిని ఎవరూ చెరిపేయలేరని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మారినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ధీమా వ్యక్తం చేసిన మహేశ్ కుమార్ గౌడ్, కవితకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్నా స్వాగతిస్తామని, వారి కుటుంబ వాటాల పంచాయితీని తమపై అంటగట్టవద్దని స్పష్టం చేశారు.











