రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు, జూన్ 2వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడం, సామాన్యుడిపై రవాణా భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతుంది.
ఈ పథకం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా లేఖ రాసింది. ఈ పథకం ద్వారా నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, రవాణా ఖర్చులను ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది.











