తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' ఆవిర్భవించింది. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ఐదు కీలక అంశాలతో కూడిన 'పాంచజన్యం'ను ఆ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ వేదిక ద్వారా పోరాటం చేస్తామని ఆమె తెలిపారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' ఏర్పడిందని, అన్ని అడ్డంకులను అధిగమించి ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థగా కొనసాగుతుందని, అయితే రాజకీయ పరంగా 'తెలంగాణ రక్షణ సేన' పనిచేస్తుందని ఆమె వివరించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై 'తెలంగాణ రక్షణ సేన' మాట్లాడుతుందని, పోరాటం చేస్తుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సర్వోదయ తెలంగాణ కావాలని ఆకాంక్షించామని, ఇప్పుడు అదే లక్ష్యంగా ముందుకు వస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపడమే సర్వోదయ తెలంగాణ లక్ష్యమని, దీనికోసం 'పాంచజన్యం' అనే ఐదు ప్రాధాన్యతాంశాలను తీసుకున్నామని ఆమె వివరించారు. ఆధర్మంపై యుద్ధం చేసే స్ఫూర్తితో ఈ అంశాలను ఎంచుకున్నామని, ప్రతిపక్షంగా, అధికారంలోకి వచ్చాక కూడా వీటిపైనే దృష్టి సారిస్తామని కవిత పేర్కొన్నారు.
విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనేవి 'పాంచజన్యం'లోని కీలక అంశాలని కవిత తెలిపారు. విద్య విషయంలో, ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారికి కూడా వారు ఎంత వరకు చదువుతారో అంత వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యం విషయంలో, ఆరోగ్యశ్రీని మరింత విస్తృతం చేసి, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి పూర్తి వైద్యం అందిస్తామని తెలిపారు. రైతులకు ఆత్మగౌరవాన్ని పెంచేలా, వారి ఉత్పత్తులకు సరైన ధర కల్పించి, ఎగుమతి అవకాశాలను మెరుగుపరుస్తామని అన్నారు. రైతు మరణాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉపాధి కల్పనలో యువత ఆలోచనలను ప్రోత్సహించి, వారికి ఆర్థిక సహాయం అందించి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తామని కవిత పేర్కొన్నారు. 18-25 ఏళ్ల లోపు ఉన్న జెన్ జీ ఆలోచనలకు అండగా నిలుస్తామని, 25-45 ఏళ్ల లోపు వారికి మంచి ఆలోచనతో వస్తే ప్రభుత్వమే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణం ఇస్తుందని తెలిపారు. అలాగే, సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. సామాజిక న్యాయం పేరుతో అగ్రవర్ణ పేదలు, వికలాంగులు, మాజీ సైనికులు, మావోయిస్టులకు కూడా ఇళ్లు కట్టించి ఇస్తామని, సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేయడమే సామాజిక న్యాయమని ఆమె పేర్కొన్నారు. వికలాంగుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.







