ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కంది మండలంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్‌బుక్కులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేశారు.
ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ వంటి నూతన పథకాలపై కూడా అవగాహన కల్పించారు. కొందరు లబ్ధిదారులు తమకు అందిన ప్రయోజనాలను వెల్లడిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు రైతు భరోసాతో పాటు వ్యవసాయ యంత్రాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, వసతి గృహాల్లో పోషకాహారం అందిస్తున్నట్లు నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ, మార్చి 6 నుంచి ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే శానిటేషన్, ఆరోగ్య కార్యక్రమాలు, గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించామని, ఈ వారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పోలీస్ శాఖతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడటం సర్పంచుల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
జిల్లాలో సివిల్ సప్లైస్ ద్వారా మూడు నెలల రేషన్ పంపిణీ జరుగుతోందని, ఇప్పటికే 80 శాతం పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. రాబోయే రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, అందుకు సర్పంచులు, ఎస్ హెచ్ జి మహిళలు సహకరించాలని కోరారు. ఈజీఎస్ కింద చేపట్టిన పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్, గ్రామ పంచాయతీ, అంగన్వాడి కొత్త భవనాల పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా సర్పంచులు చొరవ చూపాలని సూచించారు.








