జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని, జన గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై అదనపు కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా వచ్చిన ధాన్యం, కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను తనిఖీ చేయాలని, తుది దశలో ఉన్న కేంద్రాల్లో కొనుగోళ్లను త్వరగా పూర్తి చేసి, అక్కడి వాహనాలు, హమాలీలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ, పూర్తి అయిన వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపాలని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాల తరలింపునకు రవాణా కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చేలా చూడాలని జిల్లా రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు.
జన గణన ప్రక్రియను పకడ్బందీగా, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఛార్జ్ అధికారులు తమ పరిధిలోని సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ లక్ష్యం మేరకు విధులు నిర్వర్తించాలని, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వివరాలను గడువులోగా నమోదు చేయాలని సూచించారు.











