కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదిత్య హాస్పిటల్, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఐవిఎఫ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 146 యూనిట్ల రక్తం సేకరించారు.
రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని, చిన్నారుల జీవితాల్లో ఆశాకిరణాలు నింపారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించుకుని, సమాజసేవలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ నరహరి మాట్లాడుతూ, రక్తదాతలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హెల్మెట్లను బహుకరించడం అభినందనీయమన్నారు. చిన్నపిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు, హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు పాల్గొన్నారు.












